Online Puja Services

నాయనార్ల గాధలు - అప్పారు నాయనారు

3.14.246.254

నాయనార్ల గాధలు - అప్పారు నాయనారు | Nayanar Stories - Appar nayanar
లక్ష్మీ రమణ 

సద్గురువు తోడుంటే , ఆ జీవితం విజయమార్గాన పయనిస్తుందండంలో సందేహం లేదు. గురువు కృప లేనంత కాలం జీవితం మార్గం తెలియని బాటసారిలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుందే తప్ప, గమ్యాన్ని చేరుకోలేదు.  అటువంటి గందరగోళంలోనే ఉన్న అప్పారు నాయనారు జీవితాన్ని తానె గురువై సరైన మార్గనిర్దేశనం చేశారు వారి సోదరి తిలకావతి. సోదరిగా, తల్లిగా, గురువుగా అప్పారు జీవితాన్ని మలుపు తిప్పి , అప్పారులోని అద్భుతమైన భక్తుణ్ణి లోకానికి పరిచయం చేసిన పుణ్యమూర్తి ఆమె. ఆదర్శవంతమైన , సంప్రదాయ జీవనాన్ని అవలంభించిన తిలకావతి , జీవితమంతా కారుమబ్బులు కమ్మిన వేళ వెలుగు రేఖలా ఈశ్వరుని దర్శనాన్ని పొందింది.  నాయనార్లలో సమయాచార్యులని పేరొందిన నలుగురిలో ఒకరిగా అప్పారు నాయనారు మారేందుకు, తిలకావతి పొందిన ఈశ్వర అనుగ్రహమే కారణమయ్యింది అని చెప్పుకోవాలి . 

కావేరీ నది తనలోని బొట్టు బొట్టునా ఈశ్వరునికి భక్తిని నింపుకుని ప్రవహింస్తుంది కాబోలు ! ఈ బిందువులు తాకిన నేలంతా ఈశ్వరకృపకి పాత్రమవుతూ , ఆయా తీరాలలో గంగాధరుని అపార అనుగ్రహాన్ని పరిఢవిల్లజేసింది. అటువంటి కావేరీ నదీ తీరాన, పల్లవులు పరిపాలిస్తున్న తిరువామూరు ప్రాంతంలో జన్మించారు అప్పారు నాయనారు. ఆయన తల్లిదండ్రులు పూకలనారు, మాతినియారు. సోదరి తిలకావతి.  అప్పారు నాయనారుకి వారు పెట్టుకున్న పేరు  ‘మరుల్ నీకియారు’. ఆ పేరుకి అర్థం చీకట్లని పారద్రోలేవాడు అని . జ్ఞాన జ్యోతులు వెలిగించేవాడు అని. 

తిలకావతికి 12 ఏళ్ళ ప్రాయంలో అప్పటి పల్లవ రాజ్య సేనాధిపతి వరునిగా నిశ్చయించారు తల్లిదండ్రులు.  కానీ కాలం ఆమె భవిష్యత్తుని మరో విధంగా మలుపుతిప్పింది .  హటార్తుగా తల్లిదండ్రులని కోల్పోవడమే కాకుండా పల్లవరాజుల తరఫున పోరాడుతూ ఆమె కోసం నిశ్చయించిన వరుడు కూడా మరణించారు. దాంతో వివాహం జరగకపోయినా, తమ వివాహం నిశ్చయమయ్యింది కాబట్టి, అతనే తన భర్త అని భావించిన తిలకావతి సతీ సహగమనానికి సిద్ధపడింది. అప్పుడు ‘మరుల్ నీకియారు’ ఆమెకి అడ్డుపడి , “ అక్కా ! నాకు ఇక ఈ లోకంలో నువ్వు తప్ప ఎవరున్నారు ? తల్లి వైనా , తండ్రివైనా, గురువువైనా, సోదరివైనా నీవే కాదా ! నువ్వు కూడా గతించిపోతే, నాకు కూడా మరణమే శరణ్యం . కాబట్టి నాకోసం నువ్వు జీవించాలి.” అని ప్రాధేయపడ్డారు. అప్పుడామె తమ్ముని కోసం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని శివారాధనకే తన జీవితాన్ని అంకితం చేశారు. 


ఈ లోగా, మరుల్ నీకియారు ని జైన సిద్ధాంతాలు ఆకర్షించాయి. అక్కగారికి తమ్ముడు జైనాన్ని స్వీకరించడం ఇష్టం లేకపోయినా , ఆయన జైనాన్ని అవలంబిస్తూ, పాటలీపుత్రానికి వెళ్లి అక్కడి జైన విశ్వవిద్యాలయంలో చేరి, వారి మత  గ్రంధాలలో పాండిత్యాన్ని సంపాదించారు. జైనులు అతని పాండిత్యానికి ‘ధర్మసేనుడని’  బిరుదునిచ్చి గౌరవించారు. 

అయితే , తమ్ముని ఈ జైన పరిణామ క్రమం నచ్చని ఆయన సోదరి విరాట్టనేశ్వరుని దేవాలయానికి వెళ్లి అక్కడి ఈశ్వరుణ్ణి ప్రతిరోజూ తన తమ్ముణ్ణి సరైన దారిలోకి తీసుకురమ్మని ప్రార్ధించేవారు. ఒకరోజు రాత్రి ఆ విరాట్టణేశ్వరుడు ఆమెకి కలలో దర్శనమిచ్చి, “ అమ్మా ! నీవు బాధపడకు .  నీ తమ్ముని నా భక్తునిగా మారుస్తాను. అందుకు తగిన తపస్సుని అతను క్రితం జన్మలలోనే చేసి ఉన్నాడు.  మిగిలిన కర్మలని నీ తమ్ముడికి భరించలేనంత శూలవేద (తీవ్రమైన కడుపు నొప్పి)  ద్వారా తొలగిస్తాను. భయపడకు  దాన్ని భరించలేక అతను నిన్నే ఆశ్రయిస్తాడు. అప్పుడు నువ్వు నా విభూతితో దాన్ని తగ్గించగలవు” అని ఆశీర్వదించారు. 

మరుసటి రోజు  చీకట్లని చీలుస్తూ , కొత్త వెలుగులు విస్తరిస్తూ  సూర్యుడు ఉదయించే సరికి ,  మరుల్ నీకియారుకి భరించలేని శూల నొప్పి మొదలయ్యింది. జైనులు వైద్యం చేశారు .  మంత్రాలు ప్రయోగించారు. వాటి వల్ల అతని నొప్పి ఎక్కువయ్యిందేకానీ , తగ్గలేదు.  అప్పుడు అతనికి తన సోదరి తిలకావతి గుర్తుకొచ్చింది. ఈశ్వరుని పాదాలు విడిచి వేరొక ధర్మంలోకి వెళితే, రక్షించేందుకు ఈశ్వరుడు కూడా తోడుగా ఉండదని ఆమె చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వెంటనే అక్కగారిని కలుసుకోవాలని ప్రయాణమయ్యాడు. తిలకావతిని కలుసుకోవడానికి తన జైన మత దుస్తుల్ని , చిహ్నాలని విడిచి పూర్వపు మరుల్ నీకియారు గా వెళ్ళాడు . భరించలేని తన బాధని ఆమెతో చెప్పుకున్నాడు. 

తిలకావతి తమ్ముని ఊరడించింది. ఈ బాధకి ఈశ్వరుని శరణువేడడమే పరిష్కారమని సూచించింది . విరాట్టణేశ్వరుని ఆలయానికి తీసుకు వెళ్ళింది .  అక్కడ ఈశ్వరుని విభూతిని మరుల్ నీకియారు ఫాలభాగంపై త్రిపుండ్రాలుగా దిద్దుతూ , పంచాక్షరిని జపించింది . అంతే ! అప్పటి వరకూ బాధించిన శూలబాధ మెల్లిగా ఉపశమించింది . నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా తగ్గిపోయింది . వెంటనే, మరుల్ నీకియారు “ ఓ ఈశ్వరా ! నీ కరుణ అపారమైనది . అది తెలుసుకోలేక పర ధర్మమే మేలయినదని, నీకు వ్యతిరేకంగా గోదావరీ తీరంలోని పెద్దలతో వాదించాను.  అన్యమత ప్రచారం చేశాను. ఓ కరుణామయా ! నాకు ఈ యమ బాధని అనుగ్రహించి, ఆ పాపంలో కొంత కరిగించావా స్వామీ ! ఇక నేను మీ పాద కమలాలని నా హృదయంలో నిలుపుకొని సదా సేవిస్తాను దేవా ! నన్ను అనుగ్రహించండి” అని కీర్తనతో (తేవారం ) వేడుకున్నారు . 

అప్పుడు ఈశ్వరుడు అశరీర వానిగా ఇలా అన్నారు “ మరుల్ నీకియారు! ఈ దివ్యమైన కీర్తన నన్ను ఎంతో ఆనందింపజేసింది. ఇక నుండీ నువ్వు ఈ విధంగానే నన్ను కీర్తిస్తూ, వాగీశుడు (తిరునావుక్కరసార్)  అనే పేర సుప్రసిద్ధుడవుతావు”. అని ఆశీర్వదించారు. ఈ సంఘటనతో మరుల్ నీకియారు వ్యాధి నిమ్మళించడమే కాకుండా, ఆయనలోని శివభక్తి అనేక రెట్లుగా వృద్ధి చెందింది. శివునిపై అనంతమైన భక్తి తత్పరతతో కూడిన అనేక తేవారాలని ఆలపిస్తూ శైవధర్మాన్ని ప్రచారం చేయసాగారు . 

మరుల్ నీకియారులో వచ్చిన ఈ మార్పు, ఆయన ద్వారా వ్యాపిస్తున్న శైవ ధర్మం జైనులని కలతపెట్టింది. రాజుగారికి   
 రకరకాలుగా అతని గురించి నూరిపోశారు . అతనికి రాజద్రోహిగా ముద్ర వేశారు. రాజుగారు జైనుల ప్రభావంతో మరుల్ నీకియారుకి భయంకరమైన శిక్ష వేశారు .  ఏడు రోజులపాటు సున్నం బట్టీలో పెట్టమన్నారు . 

మరుల్ నీకియారు వెరవలేదు.  మనసంతా పామేశ్వరున్ని నింపుకొని స్థిరంగా పంచాక్షరిని జపిస్తూ ఉండిపోయాడు.  ఆ సున్నంబట్టీలో ఏడు రోజులున్నా ఆయన ఇసుమంతైనా చెక్కు చెదరలేదు.  ఈ సంఘటన జైనుల ప్రవర్తనలో మార్పుని తీసుకురాకపోగా వారి అక్కసుకి మరింత ఊతమిచ్చింది.  ఆ తర్వాత వారు ఆయనకి కాలకూట విషాన్ని పెట్టారు .  గరళకంఠుని భక్తుని ఆ విషం ఏమీ చేయలేకపోయింది.  ఆ తర్వాత ఒక పెద్ద బండని ఆయన నడుముకి కట్టి,  సముద్రంలో విసిరేశారు.  ఆ బండ దూది పింజలా నీటిమీద తేలుతూ మరుల్ నీకియారుని తీరానికి తీసుకొచ్చింది. ఏనుగులతో తొక్కించబోతే , అవికాస్తా ఆయన ముందు సాగిలపడి, ఆయన్ని తమ వీపుమీద ఎక్కించుకున్నాయి.  ఈ విధంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని హింసించి ఆయన  భక్తిని ఎంతగా పరీక్షించాడో అంతగా మరుల్ నీకియారు భక్తిని హింసించి పరీక్షించారు జైనులు. 

ఈ పరీక్షలన్నీ గెలవడం ఈశ్వరుడు తోడున్న వాడికి నల్లేరు మీద బండినడకే కదా ! దాంతో రాజుగారికి కూడా మరుల్ నీకియారు మహత్యం, శైవధర్మ వైశిష్యం తెలిసివచ్చాయి.  దాంతో ఆ పాండ్య రాజు స్వయంగా శైవాలంబీకుడయ్యాడు. తిరువత్తికాయి లో ఒక బ్రహ్మానందమైన శివాలయాన్ని నిర్మించాడు.  

ఇంతటి పరమేశ్వర అనుగ్రహాన్ని పొందినా, ఆయనలో తాను పరధర్మాన్ని ఆశ్రయించి తప్పు చేశానన్న భావన పోలేదు.  దాంతో, “ఓ ఈశ్వరా! నాయందు దయ ఉంచి ఈ పాపాన్ని తీసివేయండి.  ఈ శరీరం , మనసు , భక్తి కేవలం మీకే అంకితమని తెలియజేసేలా నా భుజములపై మీ చిహ్నాలైన త్రిశూల  వృషభాంకములను ముద్రించండి” అని కోరుతూ  ఒక చక్కని తేవారాన్ని ఆలపించారు.  అప్పుడు ఈశ్వరుడు తన ప్రమధులని పంపి ఆయన భుజాలపై తన చిహ్నాలని వేయించారు.  అమితానందపరవశుడై మరుల్ నీకియారు తనని ఆవిధంగా పవిత్రునిగా చేసినందుకు పరమేశ్వరునికి అనేకానేక కృతఙ్ఞతలు తెలియజేశారు . 

ఆ తర్వాత శైవ క్షేత్రాలని దర్శిస్తూ , ఆయా ప్రదేశాలలో శివుని ఆరాధించి, చక్కని కీర్తనలతో శైవ  భక్తి ప్రబోధాన్ని కొసగిస్తూ చిదంబరానికి చేరుకున్నారు మరుల్ నీకియారు  .  చిదంబరంలో నటరాజస్వామి దర్శనం ఆయనకి ఆత్మానందాన్నిచ్చింది.  ఆ నటరాజుని దర్శిస్తూ , సమాధిలోకి జారిపోయారు . ఆత్మానందంతో నటరాజుని కీర్తిస్తూ గొప్ప గానం చేశారు .  

చిదంబరంలోనే ఆయనకి తిరుజ్ఞాన సంబందారు పైన అమ్మ పార్వతీదేవి చూపిన కృప , ఆయన మహిమని గురించిన విశేషాలు తెలిశాయి .  దాంతో షియాలిలో ఉన్న ఆ చిన్నారిని కలవాలే ఉత్సతుకత మరుల్ నీకియారులో చిగురించింది . వెంటనే అక్కడికి బయలుదేరారు. ఆ విధంగా షియాలి చరిత్రలో మిగిలిపోయే ఒక గొప్ప సంఘటనకి వేదికయ్యింది . మొదటిసారి మరుల్ నీకియారుని చూస్తూనే జ్ఞాన సంబందారు  ఆయన్ని ‘అప్పారూ !(నాన్నగారూ)’ అని సంబోధిస్తూ , గట్టిగా కౌగలించుకున్నారు .  ఆ చిన్నారిని ఎత్తుకొని, ఆ చిన్నారి పాదాలకి ప్రణమిల్లి  నేను నీ సేవకుణ్ణయ్యా అన్నారు మరుల్ నీకియారు.  అప్పటి నుండీ ఆయన అప్పారు నాయనారుగా ప్రసిద్ధిని పొందారు . ఆ తర్వాత వారిద్దరూ కలిసి చిదంబరంతో సహా అనేక క్షేత్రాలు తిరుగుతూ, ఈశ్వరుని గురించి దివ్యమైన తేవారాలని గానం చేశారు . 

ఆ తర్వాత ఒకవైపు అప్పారు , మరోవైపు తిరు జ్ఞాన సంబందారు శివానుగ్రహంతో అనేకానేక మహిమలు చూపుతూ, శివ భక్తి దీపాలని ప్రజల మదిలో అఖండంగా వెలిగిస్తూ, భక్తి ఉద్యమానికి ఊపిరిపోశారు. ఈ క్రమంలో  తాగళూరు (తింగలూరు)లో అప్పారు చూపిన భక్తి మహిమ అనుపమానమైనది. ఆ ఊరిలో ఉండే  అప్పూడి యడిగళ్ నాయనారు కొడుకు పాము కరిచి మరణించాడు. అప్పుడు  అప్పారు ఆ శవాన్ని అక్కడి దేవాలయానికి తీసుకురమ్మని , ఒక దివ్యమైన తేవారముతో ఈశ్వరుని ప్రార్ధించి అతన్ని తిరిగి బ్రతికించారు . 

ఈ సంఘటన తర్వాత, తిరునీజిమలైలో అప్పారు , జ్ఞానసంబందారూ కలిసి చూపిన కృప, ఈశ్వర అనుగ్రహం విశేషమైనవి. ఒకానొక సమయంలో అక్కడ కరువుకాటకాలతో ప్రజలు అల్లాడుతున్నారు . వారిని కాపాడమంటూ, ఈ ఇద్దరు నాయనార్లూ పరమేశ్వరుణ్ణి ప్రార్ధించారు. ఈశ్వరుడు ప్రతిరోజూ వారిద్దరికీ చెరొక బంగారు నాణాన్ని అనుగ్రహించి, ప్రజల బాధలు  విధంగా ఆ ప్రాంతంలో ప్రజల ఆకలి తీర్చి, కరువుని అంతం చేయడానికి ఈ నాయనార్ల కీర్తనలు కారణమయ్యాయి . 

ఆ తర్వాత పరమేశ్వరుడే రక్షకుడై, సేవకుడై అప్పారు నాయనారు వెంట కథలైనా సందర్భాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి . ఆయా సందర్భాలలో ఈశ్వరుడు ఆయన్ని ఎన్నో పరీక్షలకి  గురి చేశారు కూడా ! ఈశ్వరుని  పాదకమలాల దర్శనాన్ని తప్ప మరేదీ ఆశించని, ఎటువంటి ప్రలోభాలకీ లోను కాని  ఆ భక్తుని నిరుపమాన భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు సుమారు ఎనభై ఏళ్ళ వయసులో ఆయనకి ముక్తిని ప్రసాదించారు. 

భక్తి ఉద్యమంలో చెరగని చరిత అప్పారు నాయనారుది. సోదరి, అప్పారుకి గురువై సరైన మార్గం చూపితే, ఆయన లోకానికే గురువై ఈశ్వర దర్శనాన్ని సత్యమార్గంలో ప్రబోధించారు. అప్పారు నాయనారు ప్రపంచానికి దర్శింపజేసిన జ్ఞాన జ్యోతి వెలుగులు మన హృదయాలను కూడా వెలిగించాలని ఆ ఈశ్వరుణ్ణి కోరుతూ .. శలవు . 

సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి దివ్యచరణారవిందార్పణమస్తు .   

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi